నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూ శర్మ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని ఇంచార్జీ సి.పి సింధూ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని అన్నారు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలని సూచించారు. అనుమతిలేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు -1884 మరియు రూల్స్ – 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పాలని అన్నారు. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలని తెలిపారు. ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించరాదని పేర్కొన్నారు. జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదన్నారు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో, సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదని తెలిపారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇట్టి దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.in లో ఆన్లైన్లో పొందపర్చడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలతో సంబంధిత ఎ.సి.పి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
