27.8 C
Hyderabad

 పోలీసులను చూస్తే నేరస్తులు భయపడాల్సిందే

Criminals ought to be afraid when they see the police.

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . . నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం

 

. . . నాడు తుపాకి గుల్ల చప్పుడు నుంచి నేడు అభివృద్ధి వైపు అడుగులు

 

. . .  విలేజ్ కమిటీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

 

. . .  నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం

 

. . . నిజామాబాద్‌ సమీక్ష సమావేశంలో డీజీపీ సి.వి.ఆనంద్‌

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నేరాల నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఫ్రెండ్లీ  పోలీసింగ్ అంటే ఎలర్జీ అని కానీ నేరస్తులు పోలీసులను చూస్తే భయపడాల్సిందేనని రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం నిజామాబాద్ రూరల్ ఏసీపీ కార్యాలయం, మోపాల్ పోలీస్ స్టేషన్ లను డీజీపీ సి.వి.ఆనంద్ ప్రారంభించారు. అనంతరం పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ యూనిఫాంలో ఉన్న పోలీసులను విధి నిర్వహణలో అడ్డుకున్నా వారిపై దాడులకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీసులు ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్‌, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లను అణచివేసేందుకు సమర్థవంతమైన పోలీసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరాలు నియంత్రణ చేస్తున్నట్టుగా వివరిస్తూ కొన్ని లోపాలను సరి చేసుకోవాలని సూచిస్తూ జిల్లా పోలీసుల పనితీరును అభినందించారు.

. . . శాంతిభద్రతల పరిరక్షణలో భేష్

నిజామాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ అభినందించారు. మతసామరస్యం,శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉండటం సంతృప్తికరమన్నారు. తాళ్ళరాంపూర్ విలేజ్ ఘటన నేపథ్యంలో విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై ఈ సంవత్సరం 69 కేసులు నమోదైనట్టుగా వివరించారు. ఒకప్పుడు నక్సల్స్‌ తూటాల శబ్దాలతో మారుమోగిన ప్రాంతాలు నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అయితే వారి కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్‌ పోలీసులు మా ఊరు.. మా భద్రత వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు.

. . .  నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాతో తనకు 27 ఏళ్ళ అనుబంధం ఉందని డీజీపీ పేర్కొన్నారు. తనకు జిల్లా ఎస్పీగా మొదటి పోస్టింగ్ జిల్లాలోనని గుర్తు చేశారు. తన రెండవ కుమారుడు ఇక్కడ ఎస్పీగా పని చేస్తున్నప్పుడే జన్మించడంతో అతని పేరును గుర్తు చేసుకునే విధంగా పెట్టినట్లు తెలిపారు. అప్పట్లో చేపట్టిన భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించారు.

. . . గోదావరి పుష్కరాలకు పటిష్ఠ భద్రత

రానున్న గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. పుష్కరాల సమయంలో రోజుకు సుమారు 2.5 లక్షల మందితో మొత్తం 1.3 కోట్ల మంది భక్తులు వచ్చే అంచనాతో బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఇతర భద్రతా చర్యలపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని డీజీపీ సూచించారు.

. . .  తగ్గిన తీవ్రమైన నేరాలు…. పెరిగిన  చిన్న తరహా మోసాలు!

నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పడుతున్నా.. ఆర్థిక మోసాలు, మాదకద్రవ్యాల కేసులు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లు డీజీపీ వివరించారు.  హత్యలు, తీవ్రమైన అత్యాచారాలు, రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు తగ్గగా చీటింగ్‌, నమ్మకద్రోహం కేసులు 34 నుంచి 35 శాతం, సాధారణ గాయాల కేసులు 18 శాతం, డ్రగ్స్‌ కేసులు 47 శాతం, రోడ్డు ప్రమాదాలు 10 శాతం పెరిగాయన్నారు. 2026లో నమోదైన కేసుల్లో 54 శాతం ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయని, కేవలం 34 శాతం కేసుల్లో మాత్రమే 60 రోజుల గడువులో ఛార్జిషీట్లు దాఖలవుతున్నాయన్నారు. న్యాయస్థానాల్లో విచారణ కోసం 15092 కేసులు పెండింగ్‌లో ఉండగా నేరాల నియంత్రణతోపాటు నమోదైన కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. 2026లో నమోదైన నేరాల పరంగా ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌ 607 కేసులతో మొదటి స్థానంలో ఉండగా నిజామాబాద్‌ రూరల్‌ 460, టౌన్‌ 1లో 449, బోధన్‌ 443, నగరంలోని 4వ టౌన్ లో 410 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. ఈ ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే కమిషనరేట్‌ మొత్తం నేరాల్లో 30 శాతం నమోదయ్యాయి. ఆయా స్టేషన్ల పరిధిలో 1393 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని, నిజామాబాద్‌ రూరల్‌లో నేరాలు గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 2025లో 294 తీవ్రమైన నేరాలు నమోదుకాగా 2026 నవంబరు 15 నాటికి222 నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 14 శాతం తగ్గాయని, హత్యలు, తీవ్రమైన అత్యాచారాలు, రాత్రి వేళల్లో జరిగే చోరీలు తగ్గడం పోలీసులకు ఊరటనిస్తోందన్నారు.

. . . పనితీరులో వెనుకబడిన స్టేషన్లు

నూతన క్రిమినల్‌ చట్టాల అమలు, కేసుల పరిష్కారం, 60,90 రోజుల గడువులో దర్యాప్తు పూర్తి చేయడం, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఈ-పెట్టీ కేసుల పరిష్కారం తదితర అంశాల ఆధారంగా పోలీస్‌స్టేషన్ల పనితీరును సమీక్షించారు. ఈ ప్రమాణాల్లో నిజామాబాద్‌ టౌన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ నగరంలోని 3వటౌన్‌, బిక్కనూరు, బోధన్‌, నవీపేట్‌, ముప్కాల్‌ పోలీస్‌స్టేషన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి  చైతన్య, ఐజీ కార్తికేయ (మల్టీజోన్‌-1), సీఐడీ డీఐజీ నారాయణ నాయక్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎస్పీ హర్షవర్ధన్‌, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ గిరిధర్‌తో  నిజామాబాద్ అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్, డీసీపీ లు, ఏసిపి లు, ఎస్ హెచ్ఓలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Criminals ought to be afraid when they see the police.

More articles

Latest article