- గడుగును ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ ఎందుకు బాధ్యతలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కమిషన్ సభ్యుడిగా నియమితులైన తర్వాత గడుగు గంగాధర్ ఆ పదవిని తీసుకునేందుకు సుముఖంగా లేక ఇదే విషయాన్ని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి వివరించారు. అయితే ఈ విషయం సీఎం చెంతకు చేరడంతో ఆయన తన నివాసానికి గడుగును రప్పించుకుని కమిషన్ బాధ్యుడిగా బాధ్యతలు స్వీకరించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తనకు పార్టీ నుంచి దూరం కావడం ఇష్టం లేదని గడుగు సీఎంకు తెలిపారు. జ్యుడిషియల్ కమిషన్ కావడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదని ఈ విషయంలో తన గురించి ఆలోచించాలని గడుగు సీఎంతో మొరపెట్టుకున్నారు. అయితే సీఎం మాత్రం కమిషన్ సభ్యులుగా ముందుగా బాధ్యతలు స్వీకరించాలని కోరారు. గడుగు మాత్రం తనకు సమయం కావాలని కోరినట్లు తెలిసింది. అయితే సీనియర్ నాయకులు, మంత్రులు మాత్రం గడుగును కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాలని సలహా ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ న్యాయం జరుగాలని సీనియర్లకు సముచిత స్థానం కోసమే జ్యుడిషియల్ కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని దానిని సద్వినియోగం చేసుకోవాలని గడుగుకు ఉద్బోధించారు. ఈ నెల 28 వరకు సీఎంను గడువు కోరిన గడుగు గంగాధర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

