నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.రంగరత్నం మాట్లాడుతూ గాంధీ బోధించిన సత్యం, అహింస, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. చరిత్ర విభాగం అధ్యాపకులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చేసిన సేవలు, ఆయన అనుసరించిన అహింసా పోరాట మార్గం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జీవితం, ఆయన పోరాట పటిమ, సత్యం, అహింసా సిద్ధాంతాలు, విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వినయ్ కుమార్, వెంకట రమణ, నరేష్ కుమార్, దస్తప్ప, రంజిత్, రాము, సుధాకర్, రాజశేఖర్, కార్యాలయ సిబ్బంది మాజిద్ అలీ, గఫార్, వాసు, గంగాధర్, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
