. . . డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులతో మరింత పారదర్శకత, జవాబుదారీతనం
. . . ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడి
. . . పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ లో శనివారం పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగింది. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసి, జయ జయహే తెలంగాణ గేయాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక స్థోమత కలిగిన వారి తరహాలోనే నిరుపేద కుటుంబాలు కూడా మూడు పూటల అన్నం తినాలనే ఉదాత్తమైన ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ఇదివరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం అందించిన దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగపడక 70 శాతం అమ్ముకునే వారని, సబ్సిడీ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిపోయేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదలకు ఆహార భద్రత భరోసా ఏర్పడిందని అన్నారు. డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చిందని తెలిపారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ సన్న బియ్యం ఒక్క గింజ కూడా పక్కదారి పట్టకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ కార్డుల వల్ల లబ్ధిదారులకు రేషన్ పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని, ఎక్కడి నుంచి అయినా ఈ కార్డు ద్వారా రేషన్ సరుకులు పొందే వెసులుబాటు లభించిందని అన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, ఉపాధి, ప్రజా సేవల రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం నిరంతర కృషిని కొనసాగిస్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో 4.77 లక్షల కుటుంబాలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఏ ఒక్క కుటుంబం సైతం తప్పిపోకుండా ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా ఈ కార్డులను పంపిణీ చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ తొమ్మిది రకాల భద్రతా ప్రమాణాలను జోడిస్తూ డిజిటల్ రూపంలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల నకిలీ, బినామీలు, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, అర్హులైన వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ అన్నారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల సంక్షేమానికి రైతు భరోసా, మహిళలకు అండగా కళ్యాణ లక్ష్మి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డుల జారీపై తగిన దృష్టి పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టిందని గుర్తు చేశారు. డిజిటల్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో మరో కీలక ముందడుగు వేసిందన్నారు. సాంకేతికత ఆధారిత పాలన ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, 2047 నాటికి రైజింగ్ తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.

నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం దక్కేలా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా అక్రమాలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.

గత సీజన్ లో ధాన్యం విక్రయాలకు రైతులు ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రేషన్ డీలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

