. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. జాబ్ మేళాలో 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో జాబ్ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో తొలిసారిగా కామారెడ్డిలో టాటా జాబ్ మేళాను నిర్వహించినప్పుడు యువత నుంచి విశేష స్పందన లభించిందని గుర్తుచేశారు. “ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబం మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తుంది” అనే నినాదంతో నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నామని మదన్ మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని తమ భవిష్యత్తుకు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ , సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

