27.4 C
Hyderabad

కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి నైట్ డ్యూటీలు రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, జాబ్ చార్ట్‌ ను పక్కాగా అమలు చేయాలని టీయూసీఐ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజా భవన్‌తో పాటు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎఎస్ పిడి అధికారులకు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. కేజీబీవీ సిబ్బందికి క్యాజువల్ లీవ్స్‌ కు సంబంధించి ఆగస్టు 11 న జారీ చేసిన ఉత్తర్వుల్లో నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లకు వర్తించే విషయంలో స్పష్టత లేదన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లకు కూడా క్యాజువల్ లీవ్స్ వర్తించేలా స్పష్టతనిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

 

Night duties for KGBV non-teaching staff must be cancelled.

 

అకౌంటెంట్లు, వర్కర్లకు నైట్ డ్యూటీలు కేటాయించడం వల్ల తీవ్ర పనిభారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నైట్ డ్యూటీల రద్దుపై ఎస్‌పీడీ ఇచ్చిన హామీని అమలు చేసి, వెంటనే వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, మెజారిటీ కేజీబీవీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది, ముఖ్యంగా వర్కర్లకు వీక్లీ ఆఫ్‌లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. జాబ్ చార్ట్ కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో నిర్ణయించిన పనిగంటలకు మించి పనిచేయిస్తున్నారని ఆరోపించారు. వీక్లీ ఆఫ్‌లు అమలు కాకపోవడం, జాబ్ చార్ట్‌కు మించి పని చేయించడం, నైట్ డ్యూటీలు కేటాయించడం వల్ల అకౌంటెంట్లు, వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్కర్లందరికీ వారానికి ఒకరోజు తప్పనిసరిగా సెలవు లభించేలా వీక్లీ ఆఫ్‌ను అమలు చేయాలని, జాబ్ చార్ట్‌ను పక్కాగా అమలు చేయాలని, నైట్ డ్యూటీలను పూర్తిగా రద్దు చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లకు క్యాజువల్ లీవ్స్ వర్తించేలా ఇదే రోజు సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం, రాష్ట్ర నాయకులు నరేందర్, అరుణ్ కుమార్, రాజేశ్వర్, రాజన్న, దేవదానం తదితరులు పాల్గొన్నారు.

 

Night duties for KGBV non-teaching staff must be cancelled.

More articles

Latest article