నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల పరిధిలోని బజార్ కొత్తూరు గ్రామ శివారులో మహిళ మెడలో నుంచి బంగారు చైన్ అపహరించిన నిందితుడిని నందిపేట్ పోలీసులు 24 గంటలు గడవకముందే అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలానికి చెందిన పిట్ట భోజవ్వ తన అక్క రత్న అనారోగ్యంతో ఉండటంతో ఆమెను పరామర్శించేందుకు ఉమ్మెడ గ్రామానికి వచ్చింది. అనంతరం తిరుగు ప్రయాణంలో మాయాపూర్ అంబేద్కర్ బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా, అటుగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి తాను నందిపేట్‌లో దింపుతానని చెప్పి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అతను కొత్తూరు గ్రామ శివారుకు తీసుకెళ్లి బైక్‌ను ఆపి, మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో పోలీసులు మాయాపూర్ గ్రామంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు దిలీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌పై గతంలోనూ ఓ అత్యాచారం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
