27.2 C
Hyderabad

అక్రమ మద్యం, మాదకద్రవ్యాలపై ఆబ్కారీ శాఖ నిఘా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మద్నూర్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

 

జుక్కల్, బతుకమ్మ :

 

అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆబ్కారీ అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, రైస్ మిల్లుల గోదాముల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్లు దుకాణాల్లో కల్లు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. దాబా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారా అనే అంశంపై అధికారులు ఆరా తీశారు. అలాగే రైస్ మిల్లుల గోదాములను తనిఖీ చేసి మాదకద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు లేదా ఇతర అనుమానాస్పద పదార్థాలను నిల్వ చేశారా అనే విషయాన్ని పరిశీలించారు. మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులోని ఆబ్కారీ చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్‌ఐ నాగేష్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది దేవిసింగ్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article