25.5 C
Hyderabad

యువత, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయి బాబా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువత, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయిబాబా పిలుపునిచ్చారు. కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్‌లో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నిజామాబాద్ నగర 9వ మహాసభ ఆదివారం నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు పీవైఎల్ తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన ఉద్యమంలో అమరులైన వీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా పీవైఎల్ ఆధ్వర్యంలో యువజన ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు. గుట్కా, సింగిల్ నంబర్ లాటరీలకు వ్యతిరేకంగా ఉద్యమించి నిషేధం సాధించడంలో పీవైఎల్ పోషించిన పాత్రను ఆయన అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయని సాయిబాబా ఆరోపించారు. దేశంలో యువత సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ఉపాధి కోసం యువత విదేశాలకు, ముఖ్యంగా అరబ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యువత సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన జెన్‌-జీ ఉద్యమాల స్ఫూర్తితో బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వనమాల సత్యం మాట్లాడుతూ, జిల్లాలో పీవైఎల్ అనేక ప్రజా, యువజన సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించిందన్నారు. సింగిల్ నంబర్ లాటరీల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న యువతను కాపాడేందుకు దశలవారీగా ఉద్యమించి విజయం సాధించామని తెలిపారు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాలు నిర్వహించి, పలు దఫాలుగా ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. గుట్కా నిషేధాన్ని ప్రస్తుత పాలకులు సమర్థవంతంగా అమలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సత్యం విమర్శించారు. యువత మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఎం. శివకుమార్ మాట్లాడుతూ, యువత కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించేలా పీవైఎల్ నాయకత్వంలో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించడంలో, కార్మికులకు సరైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. కార్మికులు, యువత కలిసి సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహాసభలో పీవైఎల్ ఉపాధ్యక్షులు బండమీది నరసయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రమేష్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గోపాల్ తదితరులు ప్రసంగించారు. యువజన నాయకులు తాంపే రాజు మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు దాసు, పీరయ్య, వినయ్, లక్ష్మణ్, ఐఎఫ్ టియు నాయకులు మోహన్, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article