23.6 C
Hyderabad

ఆటో, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐఎఫ్‌టీయూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం. శివకుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణలో ఆటో, మోటార్ రంగ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం. శివకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెజిటేబుల్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన మోటార్ రంగ కార్మికుల జీవన పరిస్థితుల్లో ఇప్పటికీ ఆశించిన మార్పు రాలేదని అన్నారు. రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది మోటార్ రంగ కార్మికులు లారీలు, క్యాబ్‌లు, ఆటోలు, వ్యాన్లు, అంబులెన్స్‌లు, డీసీఎంలు, మ్యాజిక్ వాహనాలు తదితరాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరి సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆటో, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో “ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ” పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్డు భద్రత చట్టంలోని “హిట్ అండ్ రన్” నిబంధనల కింద డ్రైవర్లపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు డి. మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు బి. భూమన్న, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మచ్చ మోహన్, మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్, ఉపాధ్యక్షులు అక్లక్ ప్రసాద్, ఇర్ఫాన్, హైమద్, మల్లేష్, రమేష్, అప్సర్, గఫర్, జబ్బార్, గబ్రు బి తదితరులు పాల్గొన్నారు.

 

A welfare board should be established for workers in the auto and motor sectors.

More articles

Latest article