24.7 C
Hyderabad

సమసమాజ నిర్మాణమే ఉద్యమ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరికేల పోశెట్టి మాదిగ

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

మత విద్వేషాలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ప్రస్తుత ఉద్యమ లక్ష్యమని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరికేల పోశెట్టి మాదిగ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్, తారకరామ్ నగర్‌లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణతో పాటు పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు సాగాయని అన్నారు. కుల వ్యవస్థ కారణంగానే పేదలు, అణగారిన వర్గాలు వెనుకబడ్డాయని, దోపిడీ, వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గౌతమ బుద్ధుడు, సంత్ రవిదాస్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షిరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. అలాగే పేదరికంలో ఉన్న అణగారిన వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ఉద్యమాలను బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలు నిర్మించాలని కోరారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీతో పాటు అనుబంధ విభాగాల నూతన కమిటీలను ఏర్పాటు చేసి విద్యావంతులు, యువతను ఉద్యమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం వై. కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించగా, తెడు గంగారాం మాదిగ, సుజాత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article