25.8 C
Hyderabad

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ సిద్ధాంతకర్త, కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలను నిజామాబాద్ పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని తెలిపారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, 1954లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారని గుర్తు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగిన జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం అంకితమయ్యారని అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ఆయన, ముందుగా భౌగోళిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఎప్పుడూ చెప్పేవారని పేర్కొన్నారు. “తెలంగాణ నా కల” అని ఆయన పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, భవిష్యత్ తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ నరేందర్, ఏఆర్ ఏసీపీ శ్రీరాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఏఓ ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు (అడ్మిన్) ధరణి కుమార్, (ఎంటీఓ) శేఖర్ బాబు, (వెల్ఫేర్) సతీష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ కార్యాలయ సిబ్బంది, సీసీఆర్‌బీ సిబ్బంది, సీఎస్‌బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

More articles

Latest article