25.8 C
Hyderabad

చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

సిరికొండ, బతుకమ్మ :

 

సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో చెరువు కట్ట తెగిన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కొండాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్టకు భారీగా గండి పడటంతో కట్ట తెగిపోయి, చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని చెరువు కట్ట పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలు, నీటి ప్రవాహం దిశ, జరిగిన నష్టం, సమీప గ్రామాలపై ప్రభావం, ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా హెచ్చరికలు జారీ చేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు చెరువులు, వాగులు, కాలువలు, వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను నీటి వనరుల వద్దకు పంపవద్దని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి సీఐ బిక్షపతి, సిరికొండ ఎస్‌ఐ జె.రామకృష్ణ, ధర్పల్లి ఎస్‌ఐ జి. సందీప్, గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

 

CP inspects the site where the tank bund breached.

More articles

Latest article