. . . ఇన్ స్టెంట్ లాభాలను నమ్మవద్దు
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
డిజిటల్ యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్ మెంట్ పేరిట జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు” రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల (వీఆర్ఈసి) లో సైబర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “100 శాతం గ్యారంటీ రిటర్న్స్”, “డైలీ ప్రాఫిట్”, “ఇన్‌సైడర్ టిప్స్”, “ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు” వంటి తప్పుడు హామీలతో మోసగాళ్లు అమాయకులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా మొదట నకిలీ లాభాలను చూపించి, తర్వాత భారీ పెట్టుబడులు పెట్టించేలా ప్రలోభపెట్టి, చివరకు ప్రాసెసింగ్ ఫీజు, అప్‌గ్రేడేషన్ ఛార్జీలు తదితర పేర్లతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అలాగే నకిలీ ఆర్థిక సలహాదారులు, కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ చట్టబద్ధ అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. అధిక లాభాల పేరుతో వచ్చే ప్రతి పెట్టుబడి అవకాశాన్ని నమ్మవద్దని, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచితులు ఇచ్చే పెట్టుబడి సూచనలను విశ్వసించవద్దని, వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పెట్టుబడులకు ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన కోరారు. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.

తెలంగాణ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, సైబర్ నేరాల నియంత్రణ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అయితే ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని తెలిపారు. ప్రతి పౌరుడు “బి అలర్ట్ – బి అవేర్ – బి సేఫ్ ” అనే సూత్రాన్ని పాటిస్తూ, “అప్రమత్తతే రక్షణ – ధృవీకరణే భద్రత – అవగాహనే ఆయుధం” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, పోలీసు అధికారులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ రూరల్ (నార్త్) సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మొఖీద్ పాషా, మాక్లూర్ ఎస్‌ఐ అనిల్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐలు రవి కుమార్, ప్రవాళిక, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ గణేష్, సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

