- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అబద్ధపు మాటలు చెబుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు దొందు దొందే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని 10 ఏళ్ళు యావత్ తెలంగాణ ప్రజలని మోసం చేసి ఒక్క ఇల్లు కూడ పేదోనికి ఇవ్వని ఘనత బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ కె దక్కుతుందన్నారు. అలాంటి పాలన వొద్దని తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, వందల హామీలను చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. 100 రోజుల్లో అమలు చేస్తానన్నా హామీలు 10 నెలలు గడుస్తున్న ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదన్నారు. పోయినోడు డబుల్ బెడ్ రూమ్ అని మోసం చేస్తే వీడు ఇందిరమ్మ ఇండ్లు అంటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండని మండిపడ్డారు. నిజామాబాదు అర్బన్ లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో అవి కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినాయని ఇందిరమ్మ ఇండ్లు దేవుడు ఎరుగు కనీసం కట్టిన ఇళ్ళైన బాగు చేసి అర్హులైన వారికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేని పక్షాన అర్హులైన వారందరితో త్వరలోనే బిజెపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం అని హెచ్చరించారు. తెలంగాణాలో రైతన్నలు తలలు పట్టుకునే పరిస్థితి ఉందని, రైతన్నలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీఅని, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అని, రైతు భరోసా గ్యారంటీ కింద రైతులకు, రైతు కూలీలకు 15వేలు, 12 వేలు అని పంట బోనస్ అని అన్ని బోగస్ మాటలు చెప్పి ఇప్పటికి వాటి ఊసే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు నిజామాబాదు కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం పై ఉన్న శ్రద్ద జిల్లా అభివృద్ధిపై లేదని ఏద్దేవా చేసారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులునాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
