హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం ప్రజా భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ వేడుకలకు విశేష ప్రాధాన్యత లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నల్లపోచమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే బోనాల వేడుకలు ప్రజా భవన్‌లో భక్తుల ఉత్సాహం, ఆధ్యాత్మిక భావాలతో వైభవంగా ముగిశాయి.

