. . . అఖిలపక్ష నాయకుల ఆగ్రహం
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మైనారిటీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను లింగంపేటకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కళాశాల భవనం శిథిలావస్థలో ఉందనే కారణంతో కళాశాలను లింగంపేటకు తరలించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిపుణులు పరిశీలించగా మరో ఐదేళ్ల వరకు వినియోగించుకోవచ్చని సూచించినప్పటికీ, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తరలింపు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. లింగంపేటలో ఎంపిక చేసిన ప్రైవేటు భవనంలో అన్ని వసతులు కల్పించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం అందిందన్నారు. అప్పటి వరకు ఎల్లారెడ్డి పట్టణంలోని మదర్సా పాఠశాల భవనంలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందున, తాత్కాలికంగా అక్కడే కళాశాలను కొనసాగించేందుకు తాము అంగీకరించినట్లు తెలిపారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మైనారిటీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను ఎల్లారెడ్డి నుంచి లింగంపేటకు తరలించే ప్రయత్నం జరుగుతోందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాల తరలింపును అంగీకరించబోమని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టి తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్, మదర్సా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎజాజ్ మసూద్, బీజేపీ రాష్ట్ర నాయకుడు మర్రి బాలకిషన్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు రజాక్, డీఎస్పీ నాయకుడు సాయిలు, మైనారిటీ నాయకులు ఇమ్రాన్, బర్కత్, యూనిస్, అమీర్, అజ్ముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
