27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హత్య కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అదనంగా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత కారాగార శిక్షతో పాటు అదనంగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోవిందపేట గ్రామంలో నాడ్పి గంగారాం ఇంట్లో అద్దెకు నివసిస్తున్న మిర్యాల పోషవ్వ గోసంగి (50) వద్దకు మామిడిపల్లికి చెందిన షేక్ మహబూబ్ తరచూ వచ్చి వెళ్లేవాడు. 2025 జనవరి 30వ తేదీ ఉదయం మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అనంతరం సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడు షేక్ మహబూబ్‌ను అరెస్ట్ చేసి జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జిల్లా జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించారు. దీంతో హత్య నేరానికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలు లభించకుండా శవాన్ని దాచిపెట్టినందుకు అదనంగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ పి.సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ గోవిందు, కోర్టు డ్యూటీ అధికారులు ఎం. గంగాధర్ (పీసీ–2033), టి.సుభాష్ (పీసీ–266), కె.నారాయణ (పీసీ–2073), హోంగార్డ్ శ్రీనివాస్ (870)లను సీపీ అభినందించి ప్రశంసించారు.

More articles

Latest article