28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అదృశ్యమైన విద్యార్థిని రెండు గంటల్లో గుర్తించిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

భిక్కనూర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి కనిపించకుండా పోయిన 5వ తరగతి విద్యార్థిని భిక్కనూర్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, గురువారం ఉదయం ప్రార్థన కార్యక్రమం అనంతరం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరిపల్లి రుత్విక్ (10), తండ్రి రాజు అనే విద్యార్థి పాఠశాల నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ సాబావత్ రఘు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ ఎస్.మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూర్ సీఐ జె.నరేష్ రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు పాఠశాల పరిసర ప్రాంతాలు, సమీప గ్రామాలు, ప్రధాన రహదారులు, బస్ స్టాండ్లు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సమన్వయంతో చేపట్టిన వేగవంతమైన చర్యల ఫలితంగా అదృశ్యమైన విషయం తెలిసిన రెండు గంటల వ్యవధిలోనే విద్యార్థిని గుర్తించారు. అనంతరం అతడిని సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. విద్యార్థిని త్వరితగతిన గుర్తించి సురక్షితంగా రక్షించిన భిక్కనూర్ పోలీసు బృందం పనితీరును జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, కామారెడ్డి డీఎస్పీ ఎస్.మధుసూదన్ అభినందించారు. ఈ సందర్భంగా భిక్కనూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. తక్షణ సమాచారం అందితే పోలీసులు వేగంగా స్పందించి తప్పిపోయిన వ్యక్తులను సురక్షితంగా గుర్తించే అవకాశం పెరుగుతుందని తెలిపారు.

More articles

Latest article