. . . 8 వాహనాల సీజ్ . . . పరారీ అయిన డ్రైవర్ లు
. . . విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యంను రవాణా చేస్తున్న8 వాహనాలను పౌర సరఫరాల శాఖాధికారులు పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లయ్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద దాడులు నిర్వహించారు. 8 వాహనాల్లో ఉన్న 350 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. పౌర సరఫరాల శాఖాధికారులు దాడులు చేయడంతో డ్రైవర్లు వాహనాలను వదిలి పరారీ అయ్యారు.పెర్కిట్ కు చెందిన నజ్జు, ఐలయ్య, ఎల్లయ్య, సంజయ్, రాఖీ అనే వ్యక్తులతో పాటు మరికొందరు నిబంధనలకు విరుద్దంగా రేషన్ బియ్యం సేకరించి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత రేషన్ బియ్యం ఎక్కడికి రవాణా అవుతున్నాయి, ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉందని విచారణలు తేలుతుందని అధికారులు తెలిపారు. పరారీ అయిన వాహనాల డ్రైవర్ల విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
