. . . టీఎస్‌ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వట్లంగారి దత్తు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ డీఈఓ (విద్యాశాఖ అధికారి) పోస్టులకు కేవలం డిగ్రీ, పీజీ అర్హతలను మాత్రమే నిర్దేశించడం సముచితం కాదని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎస్‌ఎఫ్) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వట్లంగారి దత్తు అన్నారు. విద్యారంగానికి సంబంధించిన ఈ కీలకమైన పోస్టులకు బీఈడ్, ఎంఈడ్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ శిక్షణతో పాటు విద్యా పరిపాలనపై అవగాహన ఉన్న వారిని పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తేనే విద్యారంగంలో నాణ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీఈడ్, ఎంఈడ్ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, వారికి డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించకపోవడం అన్యాయమని దత్తు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పునఃసమీక్షించి, అర్హతల విషయంలో తగిన మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.
