. . . వైద్య సేవల మెరుగుదలపై అధికారులకు డా. కవితా రెడ్డి ఆదేశాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నిజామాబాద్‌లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, వివిధ విభాగాల పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచార బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా హెచ్.డి. యూనిట్, ఏ.ఎన్.సి. క్లినిక్, జీవనధార ఫార్మసీతో పాటు ఇతర విభాగాలను సందర్శించి, రోగులకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన, ప్రజలకు అనుకూలమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను సంబంధిత అధికారులకు ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా రోగి కేంద్రిత సేవలు, పరిశుభ్రత, సమయపాలన, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను డా. కవితా రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వ వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, వాటిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

