25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫ్లోరోసెన్స్ గైడెడ్ రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత దశాబ్దంలో క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ట్యూమర్ బయాలజీపై మెరుగైన అవగాహన పెరగడంతో ప్రస్తుతం క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా, రోగికి మెరుగైన జీవన నాణ్యతను అందిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని కల్పించడం అని వివరించారు. రోబోటిక్ శస్త్రచికిత్సల్లో హై-డెఫినిషన్ 3డి విజన్, ట్రెమర్ – ఫ్రీ ఇన్‌స్ట్రుమెంట్స్, మానవ చేతి కదలికలను అనుకరించే వ్రిస్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో క్లిష్టమైన ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చన్నారు. కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా పెద్ద కోతలు లేకుండానే శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుందని, దీని వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, చిన్న మచ్చలు మాత్రమే ఉండటంతో పాటు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రోబోటిక్ శస్త్రచికిత్సలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారుతున్నాయని డాక్టర్ చిన్నబాబు పేర్కొన్నారు. ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలో ప్రత్యేక ఫ్లోరోసెంట్ రంగుల సహాయంతో క్యాన్సర్ కణాలను స్పష్టంగా గుర్తించి, ఆరోగ్యకరమైన కణజాలానికి ఎలాంటి నష్టం కలగకుండా కణితిని మాత్రమే తొలగించవచ్చని వివరించారు. ఈ ఆధునిక విధానాల ద్వారా రక్తస్రావం గణనీయంగా తగ్గడంతో పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు కూడా తగ్గుతాయని, రోగులు త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి వస్తారని చెప్పారు. తక్కువ నొప్పి, తక్కువ రక్తనష్టం, వేగవంతమైన కోలిక, మెరుగైన జీవన నాణ్యత, తక్కువ మచ్చలు, కుటుంబ, ఆర్థిక ఒత్తిడి తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు రోగులకు లభిస్తాయని తెలిపారు. రోబోటిక్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలు క్యాన్సర్ శస్త్రచికిత్సలను కేవలం వ్యాధి నివారణకే పరిమితం చేయకుండా, రోగి జీవన నాణ్యతను మెరుగుపరిచే దిశగా తీసుకెళ్తున్నాయని డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి పేర్కొన్నారు. ఆధునిక క్యాన్సర్ చికిత్సల ప్రధాన లక్ష్యం క్యాన్సర్‌ను నయం చేయడంతో పాటు రోగి జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ పీఆర్‌వో మధు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article