27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఒక్కరు ఓటరు వివరాలను తప్పనిసరి సమర్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్ ఐ ఆర్ లో ఓటరు వివరాలు నమోదు చేసుకోకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం

 

. . . ఒకే దగ్గర కూర్చుని వివరాలు సేకరిస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తహసీల్దార్ సమక్షంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) తన వ్యక్తిగత ఓటరు వివరాలను ఆయన స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. అధికారులకు, బీఎల్ఏ లకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఈ నెల 23 వ తేదీ లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి వారికీ ఇవ్వాలన్నారు. మొత్తం రెండు ఫారాలు ఉంటాయని, ఒకటి బీఎల్‌ఓకు అందజేసి, అధికారుల సంతకం ఉన్న మరో ఫారాన్ని (రసీదు గా) ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫారాలు నింపి, అధికారులకు సమర్పించకపోయినా లేదా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కోరారు. ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు, బూత్ లెవల్ అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు జారీ చేశారు. బీఎల్‌ఓలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గుడులు లేదా సంఘం భవనాల్లో ఒకే దగ్గర కూర్చుని వివరాలు రాయడం సరికాదన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ స్వయంగా వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు ఒకే దగ్గర కూర్చుని పనిచేస్తే ప్రజల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి, ఓటర్లను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించిన తర్వాతే ఆఫీసులో ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కూడా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ ఓ లపై ఉందన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లే సమయంలో ఏజెంట్లు కూడా వారితో పాటు వెళ్లి, ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరితో ఓటరు వివరాలు నమోదు చేయించాలని ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల తహసీల్దార్ అనిరుద్, బీఎల్ఓ లు, సర్పంచ్ అశోక్, బబ్బుర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article