మోర్తాడ్, బతుకమ్మ :
ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోర్తాడ్‌లో ప్రిన్సిపాల్ గంగాధర్ అధ్యక్షతన డ్రగ్స్ వినియోగం నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎస్సై రాము పాల్గొని “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” అనే లక్ష్యంతో విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎస్సై రాము సూచించారు. రహదారి భద్రతకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, చట్టాలను గౌరవించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లక్ష్మీనారాయణ, పరుశురాం తదితరులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
