28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ హక్కులను కాలరాసే చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్రాల అధికారాలను లాక్కునే కుట్రను చట్టం పేరుతో అమలు చేయాలని కేంద్రం చూస్తోంది

 

. . .  కర్ణాటక, కేరళతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధం

 

. . . 60 రోజుల ఉపాధి కాదు… గ్రామీణ పేదలకు కనీసం 200 రోజుల ఉపాధి హక్కు కల్పించాలి

 

. . . జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం

 

. . . మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వీబీ-జీ రామ్-జీ చట్టం – 2025ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యథాతథంగా అంగీకరించబోదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అధ్యక్షతన రెండో మంత్రివర్గ  ఉపసంఘం  సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ డి.దివ్య తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇది కేవలం ఉపాధి హామీ చట్టం సవరణ కాదని, భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిపైనే జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమంగా కేంద్రీకరించి, గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్తును తాకట్టు పెట్టే చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తలవంచి అమలు చేయదు. ప్రజల ప్రయోజనాలే మాకు పరమావధి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు ఉపసంఘానికి వివరించారని తెలిపారు. అవసరమైతే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపులు తడతాం. తెలంగాణ ఒక్కటే కాదు… సమాఖ్య వ్యవస్థను విశ్వసించే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి, ఉమ్మడి న్యాయపరమైన, రాజకీయ కార్యాచరణపై చర్చించాలని ఉపసంఘం నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న దాదాపు 20 పౌరసంఘాలు కేంద్ర ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం స్వంత ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని వారు సూచించారని తెలిపారు. 60 రోజుల ఉపాధి పరిమితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 200 రోజుల హామీ ఉపాధి కల్పించాలని, చట్టబద్ధ కనీస వేతనాలు చెల్లించాలని పౌరసంఘాలు ప్రభుత్వాన్ని కోరాయని మంత్రి వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్య విధానం తెలంగాణపై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపే ప్రమాదం ఉందని, ఈ అంశాన్ని రాష్ట్ర న్యాయశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. పనితీరు బాగున్న రాష్ట్రాలను శిక్షిస్తూ, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించేలా కేంద్రం రూపొందించిన నిధుల కేటాయింపు విధానం అన్యాయమని మంత్రి విమర్శించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమగ్ర సూచనలు పంపినా వాటిని పూర్తిగా విస్మరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, రాష్ట్ర రాజ్యాంగబద్ధ అధికారాలు, గ్రామీణ పేదల జీవనోపాధిని కాపాడటం మా బాధ్యత. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ చూస్తూ ఊరుకోదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అవసరమైతే రాష్ట్ర చట్టం తీసుకురావడం, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టడం వంటి అన్ని ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

We will not accept, under any circumstances, the law that tramples upon Telangana's rights.

More articles

Latest article