. . . రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న
కోటగిరి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న అన్నారు. దళిత, గిరిజన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న సామాజిక వివక్షను ఖండిస్తూ, అక్రిడిటేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఐ&పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ముట్టడి కార్యక్రమానికి మద్దతు కూడగట్టే క్రమంలో ఆయన శుక్రవారం కోటగిరి మండల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రిడిటేషన్ల మంజూరులో దళిత, గిరిజన జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతోందని, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులను పక్కనపెట్టే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. అర్హులైన దళిత, గిరిజన జర్నలిస్టులకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్టుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. గడువు ముగిసిన అక్రిడిటేషన్లను సంవత్సరాల తరబడి కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. దళిత, గిరిజన జర్నలిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారి పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల పేరుతో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 28వ తేదీలోగా దళిత, గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే తమ పోరాటం కొనసాగుతుందని, దళిత, గిరిజన జర్నలిస్టుల హక్కుల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే ముట్టడి కార్యక్రమానికి దళిత, గిరిజన జర్నలిస్టులు, దళిత-గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో బేగరి రాములు, పుప్పాల సైదయ్య, రాము, మోరే జీవన్, యాదవరావు, భీంరావు, పున్నె అర్జున్ తదితర దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.