29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న మాధవ్‌నగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఐదేళ్లకు పైగా క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, నిధుల విడుదలలో జాప్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. గత ఏడాదిలోనే పనులు పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదని, అనంతరం 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కొత్త గడువు విధించినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది గాయపడటంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లా ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో, నిధులు విడుదల చేయించడంలో, పనులను పర్యవేక్షించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలని, లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, శంకర్ గౌడ్, పి. వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వై. గంగాధర్, కొండ గంగాధర్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article