27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యతే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం పెంపొందించడంతో పాటు వారికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు బీమా రక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

 

Employee safety is the government's responsibility.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.1 కోటి బీమా సౌకర్యం కల్పించడం సాధ్యమైందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగి అనుకోని ప్రమాదంలో మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పులు మోపి అనేక సమస్యలను సృష్టించారని విమర్శించిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులోనూ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రతి నెలా రూ.200 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు విడుదల చేశామని, వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా తొలి విడతగా రూ.1,000 కోట్లు విడుదల చేశామని వివరించారు. పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవల అందజేత, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంపొందించడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, విద్యా సంస్కరణలు, మహిళా సంఘాలకు రుణాల లింకేజీ వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలులో ఉద్యోగుల కృషి ఉందని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమని సీఎం చెప్పారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పనిచేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Employee safety is the government's responsibility.

More articles

Latest article