24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలి

 

. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో  అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేయాలని అన్నారు. ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదు అన్న సంకల్పంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తూ, క్లోరినేషన్ జరిపించాలని సూచించారు. మున్సిపల్ పట్టణాలలో డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, వ్యాధులు ముప్పిరిగొనే ప్రమాదం ఉన్నందున సానిటేషన్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఇళ్ళ మధ్యన ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, సురక్షిత ప్రదేశాల్లోకి మార్చాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీ.హెచ్.సీలలో వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చాలని, సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అవసరం ఉన్న చోట కాంట్రాక్ట్ పద్దతిన వైద్యులను, సిబ్బందిని నియమించుకుని ప్రజలకు సమర్ధవంతంగా వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో మద్యాహ్న భోజనం మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, అన్ని బడులలో పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు జరిగేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని హితవు పలికారు. ఇదిలాఉండగా, డివిజనల్ పంచాయతీ అధికారులు వారివారి పరిధిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూ, నిజామాబాద్ ను గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. లేఅవుట్ వెంచర్లలో ఓపెన్ స్పేస్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీ.ఆర్.ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article