. . . ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో 561 కేసులకు ముగింపు
. . . రూ.20 లక్షలకు పైగా జరిమానాలు, సెటిల్‌మెంట్లు
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (నాల్సా), సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 561 కేసులకు పరిష్కారం లభించింది. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌కు న్యాయమూర్తి ఎమ్. సుష్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్, సివిల్, బ్యాంకు రుణ వివాదాలు, సైబర్ నేరాలు, ఇతర పెండింగ్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. కోర్టు వర్గాల వివరాల ప్రకారం పరిష్కరించిన కేసులలో క్రిమినల్ కేసులు 8 కాగా, రూ.61 వేల జరిమానా విధించారు. అబ్కారీ శాఖకు సంబంధించిన 14 కేసుల్లో రూ.70 వేల జరిమానా వసూలు చేశారు. పిటీ కేసులు 459 పరిష్కరించగా, రూ.4,90,800 జరిమానా విధించారు. బ్యాంకు రుణ తగాదాలకు సంబంధించి 37 కేసులు పరిష్కరించబడి రూ.13,60,092 మేరకు సెటిల్‌మెంట్లు జరిగాయి. సైబర్ నేరాలకు సంబంధించిన 5 కేసుల్లో బాధితులకు రూ.50,729 తిరిగి అందించారు. అదేవిధంగా 37 క్రిమినల్ తగాదాలు రాజీ మార్గంలో పరిష్కారం కాగా, ఒక భత్యం కేసుకు కూడా ముగింపు పలికారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా ప్రజలు కోర్టుల్లో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారని తెలిపారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో జరిగే పరిష్కారాలు శాశ్వత పరిష్కారానికి దోహదపడతాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో వెలువడే తీర్పులు తుది తీర్పులుగా పరిగణించబడతాయని, సాధారణ న్యాయ ప్రక్రియతో పోలిస్తే సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని న్యాయవర్గాలు వివరించాయి. ఎల్లారెడ్డి కోర్టులో ఒకేరోజు వందలాది కేసులు పరిష్కారం కావడం ప్రజలకు న్యాయ సేవలపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
