26.6 C
Hyderabad
Monday, August 3, 2026

సింగరేణి ప్రాంతంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. త్వరలో భూపాలపల్లిలోని బొగ్గు గనిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. “మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రజలు, సింగరేణి కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నాం. ఇక్కడ జిల్లా స్థాయిలో శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు, రాష్ట్ర స్థాయిలో భట్టి విక్రమార్క కలిసి ప్రజల సమస్యలను పక్కన పెట్టి అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారని ఆరోపించారు. వీరు ముగ్గురు బందిపోట్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక, మట్టి, బూడిద దందాలు జరుగుతున్నాయని ఆరోపించిన కవిత.. సింగరేణి ప్రాంత వనరులను దోచుకుంటున్నారని అన్నారు.

. . . రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విమర్శలు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కవిత అన్నారు. కల్లాల్లోనే వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా, యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వానికి వారి ఆగ్రహం తప్పదని అన్నారు.

 

The problems of the people in the Singareni region are being ignored.

 

. . . సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని కవిత ఆరోపించారు. వేలాది ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, కొద్ది ఉద్యోగాలతో పబ్లిక్ మీటింగులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

. . . ప్రాంత అభివృద్ధి అంశాలపై డిమాండ్లు

పెద్దపల్లి ప్రాంతంలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, కాలువల మరమ్మతులు, మంథని–ముత్తారం లింకేజీ పనులను వేగవంతం చేయాలని కవిత డిమాండ్ చేశారు. భూపాలపల్లి బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించాలని కోరారు. రామగుండం ప్రాంతంలో కాలుష్యం తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

. . . ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతాం

తెలంగాణ రక్షణ సేన ప్రజల సమస్యలపై పోరాడుతుందని కవిత అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని, ఆ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

 

The problems of the people in the Singareni region are being ignored.

More articles

Latest article