30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అప్పుల భారంతో హార్డ్‌ వేర్ వ్యాపారి బలవన్మరణం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కస్టమర్లు బాకీలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు

 

. . . గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి

 

నందిపేట, బతుకమ్మ :

 

నందిపేట మండల కేంద్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాన్ని తట్టుకోలేక స్థానిక హార్డ్‌వేర్ వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) బలవన్మరణానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానిక వ్యాపార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేటకు చెందిన ఎర్రం పవన్ కుమార్ చాలా సంవత్సరాలుగా మండల కేంద్రంలో ‘రాజేష్ హార్డ్‌ వేర్’ పేరుతో దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు వివిధ మార్గాల్లో అప్పులు చేసి హార్డ్‌వేర్ సామగ్రిని కొనుగోలు చేశారు. అయితే దుకాణం నుంచి మెటీరియల్ తీసుకెళ్లిన పలువురు కస్టమర్లు నెలలు గడిచినా బాకీలు చెల్లించకపోవడంతో ఆయన ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది. ఒకవైపు మార్కెట్‌లో చేసిన అప్పులు, మరోవైపు వాటిపై పెరుగుతున్న వడ్డీలు, రావాల్సిన బకాయిలు అందకపోవడం వల్ల పవన్ కుమార్ తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో పాటు అప్పుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల కాలంలో తరచూ ఆందోళనకు గురవుతూ కుటుంబ సభ్యులతో తన సమస్యలను పంచుకునేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన లక్కంపల్లి శివారు ప్రాంతానికి వెళ్లిన పవన్ కుమార్ గడ్డిమందు (క్రిమిసంహారక మందు) తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మృతుడి భార్య హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ తెలిపారు.

More articles

Latest article