. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం, బతుకమ్మ :
రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతుండగా కొందరు మంత్రుల ఆస్తులు, ఆదాయాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. బుధవారం పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమ భూకబ్జాలు, ఇసుక దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన ఈడీ దాడుల అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్, ఆ కేసులపై కాంగ్రెస్, బీజేపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. భూవివాదాలు సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వివాదాస్పద భూముల పేరిట సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రిగా ఉన్న పొంగులేటి ఇతర మంత్రులతో అహంకారంగా ప్రవర్తిస్తున్నారని, బీసీ మంత్రులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హౌసింగ్ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తిన కేటీఆర్, ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఇళ్ల హామీ అమలులో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎన్ని ఇళ్లు అందించారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడుతూ, గతంలో రద్దు చేసిన భూమి శిస్తును తిరిగి అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతులపై అదనపు భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. అదే విధంగా ములుగు జిల్లాలో ఇసుక వ్యాపారం, టెండర్ల వ్యవహారాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కంటే విధ్వంసానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గులాబీ జెండానే ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కండాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

