27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నీట్ వివాదంపై హైదరాబాద్‌లో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కావాలని సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యా సంస్కర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ వేదిక కాదని, దేశంలోని ప్రతి భారతీయుడిని చైతన్యవంతులను చేయడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా సంస్థల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహారం తప్పనిసరి కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రితో సహా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించేలా వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రజల గొంతులను అణచివేయకుండా, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అంశాలపై గళం విప్పుతున్న హైదరాబాద్ ప్రజలను చూసి గర్వంగా ఉందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆకాంక్ష చతుర్వేది ఘటనను ప్రస్తావించిన వాంగ్‌చుక్, ఆమె చదువు కోసం తండ్రి రూ.3 లక్షలు అప్పు చేశారని చెప్పారు. డాక్టర్ అయి కుటుంబ ఆర్థిక సమస్యలను తీర్చాలని ఆకాంక్ష కలలు కన్నప్పటికీ, పేపర్ లీక్ వార్తలతో తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీకి చెందిన క్రీడాకారిణి విజేత దహియా మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించడం లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం సరైన విధానం కాదన్నారు. ప్రతి వ్యక్తికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు అనే ముద్రలు వేయడం సరికాదని విమర్శించారు. తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యార్థులను ప్రతి ఏడాది మోసం చేసే విధంగా పరిపాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

More articles

Latest article