. . . బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్
బోధన్, బతుకమ్మ :
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం బోధన్ పట్టణంలోని పీఆర్‌టీయూ భవన్‌లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎన్. బాల్‌రాజ్, ఎం.డి. మోషిన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు సకాలంలో అందించడంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జిల్లా, డివిజన్ స్థాయిలోని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన నిర్వహించాలని, తరగతులకు అనుగుణంగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు తదితర వస్తువుల విక్రయాలను యాజమాన్యాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే విద్యార్థి సంఘాలుగా నిరంతరం స్పందిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు తల్లారి సంజయ్, డి. కిరణ్, రాజన్న, మోహన్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
