. . . అంబులెన్స్ సిబ్బంది చొరవ
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలలు నిండక ముందే జన్మించిన ఓ మగ శిశువును అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి కాపాడారు. పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన గీద మానస తన మూడవ కాన్పులో నెలలు నిండక ముందే మగ శిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. జననం అనంతరం శిశువు నిర్జీవ స్థితిలో ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేకాకుండా శిశువు బరువు తక్కువగా ఉండి, ఏడవకపోవడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వైద్యుడు శిశువును సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. శిశువును తరలిస్తున్న సమయంలో 108 అంబులెన్స్ లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ కృష్ణ స్వామి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించడంతో పాటు అంబు బ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించారు. అలాగే ఐవీ ద్రావణాలు అందిస్తూ శిశువును సురక్షితంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా శిశువు తండ్రి సంతోష్ అంబులెన్స్ సిబ్బంది సేవలను అభినందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవలో ఈఎంటీ కృష్ణ స్వామి, అంబులెన్స్ పైలట్ సుదర్శన్ గౌడ్ కీలక పాత్ర పోషించగా, వారి సమయస్ఫూర్తి, అంకితభావాన్ని స్థానికులు ప్రశంసించారు.
