. . . ఇల్లు పూర్తిగా దగ్ధం
. . . 2 లక్షల నగదు, బంగారం, అగ్నికి ఆహుతి
. . . కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కూలీ కుటుంబం
. . . ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మేదరి నర్సయ్య అనే కూలీ అద్దెకు ఉంటున్న నివాస గృహం పూర్తిగా తగలబడింది. బాధిత కుటుంబం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మేదరి నర్సయ్య, ఆయన భార్య ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ తమ ముగ్గురు చిన్న పిల్లలను పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం నర్సయ్య కూలి పనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన భార్య ఇంటి బయట పిల్లలకు స్నానం చేయిస్తోంది. ఒక్కసారిగా ఇల్లాలు గమనించేసరికి ఇంటో నుంచి భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. కంగుతిన్న ఆమె కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు, బంగారంతో పాటు వచ్చే నెల 1వ తేదీన చిట్టీ డబ్బులు చెల్లించడం కోసం తెచ్చి పెట్టుకున్న రూ. 2 లక్షల నగదు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కంటి ముందే సర్వస్వం కాలిపోవడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. ప్రమాద తీవ్రతకు సర్వస్వం కోల్పోయి అనాథలుగా మారిన మేదరి నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.