. . . ఖాతాదారుల అవస్థలు
ఇందల్ వాయి, బతుకమ్మ :
మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ శాఖలో గత నెల రోజులుగా తీవ్ర నగదు కొరత ఏర్పడటంతో స్థానిక, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు సంబంధించిన డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినప్పటికీ, బ్యాంకుకు వస్తే నగదు లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి రూపాయి ఖర్చు చేసుకొని బ్యాంకుకు వస్తే, సరిపడా డబ్బులు లేవనే కారణంతో రోజుకు కేవలం రూ.5,000 మాత్రమే ఇస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆ మొత్తమైనా అందరికీ దక్కడం లేదని, చాలా మంది ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోందని మండిపడుతున్నారు. నెల రోజులుగా ఈ సమస్య వేధిస్తున్నా బ్యాంక్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు, అత్యవసర వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలకు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సిర్నాపల్లి ఇండియన్ బ్యాంకులో సరిపడా నగదు నిల్వలు అందుబాటులో ఉంచాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

