27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ – కర్ణాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై సానుకూల చర్చలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సాగు, త్రాగునీటి అవసరాలకు ఉభయ రాష్ట్రాల సమన్వయంపై దృష్టి

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, సాగునీటి, త్రాగునీటి అవసరాలపై సానుకూల వాతావరణంలో కీలక చర్చలు జరిగాయి. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో కర్ణాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, రాయచూరు ఎంపీ జి. కుమార్ నాయక్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తదితర ప్రజాప్రతినిధులు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరిగినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా విధానాలు రూపొందించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని కర్ణాటక ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి హక్కులు, భవిష్యత్ త్రాగునీటి అవసరాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రతిపాదనలు రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి వివరించినట్లు చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై జరిగిన చర్చల్లో తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర హక్కులకు భంగం కలగకుండా, పరస్పర అవగాహనతోనే జలాల వినియోగం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి నివేదించి, తదుపరి చర్యలపై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

 

Positive discussions on Krishna water usage between Telangana and Karnataka

More articles

Latest article