నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాలను ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

