24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

. . . మేలు రకం విత్తనాలను వినియోగించాలని రైతులకు పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్ ను పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి, అధికారులకు సూచనలు చేశారు.

 

Crops should be cultivated according to weather conditions.

 

అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున, తక్కువ నీటి వినియోగం అవసరం అయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని, మేల్ సీడ్ ను వాడవద్దని సూచించారు. ఖరీఫ్ లో జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ రబీలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. దిగుబడులు ఆలస్యంగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మినహాయిస్తే, జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయ్యిందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్ లో సైతం ఒకటి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని తెలిపారు.

. . . యువత కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు

యువత విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా జిల్లా కేంద్రంలోని న్యాక్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శిక్షణ తరగతుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సాంకేతిక విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు న్యాక్ ద్వారా ప్లంబింగ్, హౌజ్ వైరింగ్, ఫిట్టర్, సెంట్రింగ్, మెసన్, యూనిఫాం స్టిచింగ్ వంటి కోర్సులలో శిక్షణ అందించేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా త్వరలోనే ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరిస్తారని అన్నారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Crops should be cultivated according to weather conditions.

More articles

Latest article