. . . జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రులు, సీ.ఎస్
. . . రికార్డు స్థాయిలో 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
. . . 96 శాతం మేరకు పూర్తయిన ధాన్యం కొనుగోళ్లు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువడం పట్ల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరి ధాన్యం సేకరణ, జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 96శాతం మేర 6.62 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు సంబంధిత అధికారులను అభినందించారు. వేసవి తీవ్రత, హమాలీల కొరత వంటి అనేక ప్రతీకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి – 2026 సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు పూర్తయ్యాయని వివరించారు. ఇందులో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని గణాంకాలు వెల్లడించారు.

ఇతర జిల్లాలలో కూడా ధాన్యం సేకరణను వేగవంతం చేసి, ఈ నెలాఖరు నాటికి అన్ని చోట్లా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గడిచిన మూడు సీజన్ ల నుండి స్వతంత్ర భారత దేశంలోనే ప్రభుత్వ పరంగా రైతుల నుండి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోందని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో యాసంగిలో 8575 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి పెద్ద ఎత్తున ధాన్యం సేకరిస్తున్నామని వివరించారు. సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతుల ఖాతాలలో రూ.45 వేల కోట్లకు పైగా డబ్బులు జమ చేశామని అన్నారు.

ధాన్యం సేకరణ తుది దశకు చేరిన దృష్ట్యా, ఇదే స్పూర్తితో పనిచేస్తూ రైతుల నుండి మిగిలిన ధాన్యం నిల్వలను సైతం వేగంగా కొనుగోళ్ళు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ఒకవేళ వర్షాలకు ధాన్యం తడిసినా, దానిని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ మేరకు రైతులకు భరోసా కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, నేరుగా తమ దృష్టికి తేవాలని అన్నారు. తాలు, తరుగు పేరిట ఎక్కడైనా మిల్లర్లు, ట్రేడర్లు రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంట కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, వరి పంట కోసిన అనంతరం కొంతమంది రైతులు వరి కోయ్యలకు నిప్పు పెడుతున్నారని, ఇది పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు భూసారం దెబ్బతింటుందని, ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వరి కోయ్యలకు నిప్పు పెట్టకుండా రైతులకు గ్రామగ్రామాన విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, చిత్రారామచంద్రన్, దివ్య దేవరాజన్ తదితరులు ఈ నెల 25 నుంచి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించే మహిళా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోజువారీగా చేపట్టాల్సి ఉన్న కార్యక్రమాలను తెలియజేస్తూ, మహిళా సంక్షేమ వారోత్సవాలను నిర్దేశిత షెడ్యూల్ మేరకు నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి, డీడబ్ల్యూఓ పద్మ, సీ.పీ.ఓ రతన్, ఎ.పీ.డీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

