25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గిడ్డంగుల వద్ద ఆన్ లోడింగ్ ప్రక్రియ పరిశీలన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ శివారులోని గోడౌన్ ను సైతం కలెక్టర్ సందర్శించారు. ముందుగా కొనుగోలు కేంద్రంను తనిఖీ చేసి, రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు.

 

Collector inspects corn purchasing center

 

మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతంను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యింది, ఇంకా ఎంత పరిమాణంలో పంట సేకరణ జరగవలసి ఉన్నదని తదితర వివరాలు అడిగి తెలుసుకుని, అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు కేంద్రానికి తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు.

 

Collector inspects corn purchasing center

 

సేకరించిన పంటను వెంట వెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున త్వరితగతిన మొక్కజొన్న నిల్వలను గోడౌన్లకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని, మొక్కజొన్న రవాణాలో జాప్యానికి తావులేకుండా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నిర్దిష్ట గడువు లోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూడటం అధికారుల బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీనగర్ లోని గోడౌన్ ను కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న నిల్వల ఆన్ లోడింగ్ తీరును, మొక్కజొన్న బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. గోడౌన్ లో పూర్తి సామర్థ్యం మేరకు పంటను నిల్వ చేయాలని, పంటకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న స్టాక్‌ను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రేఖా నాయక్, ఎంపీడీఓ నరేష్, మార్క్ ఫెడ్ సిబ్బంది భాస్కర్ తదితరులు ఉన్నారు.

Collector inspects corn purchasing center

More articles

Latest article