నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహనతో పాటు సన్నద్ధతను మరింత పెంపొందించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో ఈ నెల 18న జిల్లా స్థాయిలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై గురువారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా, నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్‌ను ఈ నెల 18న నిర్వహించాలని సూచించారు.

విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలి, ఆస్తి, ప్రాణనష్టం నివారించేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కలుగుతుందని, విపత్తులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధత ఏ మేరకు కలిగి ఉన్నామనేది అవగతం అవుతుందని అన్నారు. గతేడాది భారీ వర్షాలు కురిసిన సందర్భంగా ఆయా జిల్లాలలో పలు గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ ఏర్పడితే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని, ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడడం, సురక్షిత ప్రాంతాలకు తరలించి, పక్కాగా సహాయక చర్యలు చేపట్టేందుకు మాక్ ఎక్సర్ సైజ్ దోహదపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని సూచించారు. మాక్ ఎక్సర్సైజ్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
