28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటిఆర్ పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

 

నర్సంపేట, బతుకమ్మ :

 

ఆర్టీసీ సమ్మె కాలంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని దివంగత శంకర్ గౌడ్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ ఫోటోకు పూలమాలలు వేసి శ్రధ్దాంజలి ఘటించారు.

 

KTR visits RTC driver Shankar Goud's family

 

ఈ సందర్భంగా పార్టీ తరపున వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్ లను కేబినెట్‌లో చర్చించి, తదనంతరం వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని గుర్తు చేశారు. కానీ, దురదృష్టవశాత్తు సంస్థ విలీనాన్ని కేబినెట్ ఆమోదించిన వెంటనే ఎన్నికలు రావడం, ఆ తర్వాత మేము ఓడిపోవడం, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు కార్మికులకు న్యాయం చేసే విధంగా పీఆర్సీ ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత వచ్చే అన్ని హక్కులు కల్పిస్తామని వాగ్దానం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన పనిని చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని ఆ సమ్మె సమయంలో నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టాలని కోరుతూ ఆత్మహుతికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మా నాయకులు నర్సంపేటకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ప్రయత్నిస్తే, మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు అన్నారు. మేము కూడా పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులకు కూడా తప్పకుండా మద్దతుగా నిలుస్తాం అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి వారి కుటుంబానికి, అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దాం అని కేటిఆర్ పిలుపు నిచ్చారు.

 

KTR visits RTC driver Shankar Goud's family

More articles

Latest article