30.9 C
Hyderabad
Monday, August 3, 2026

భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:

 

తన వివాహేతర సంబంధం విషయంలో అడ్డు వస్తుందని, అదనపు కట్నం కోసం భార్యను వేదించడమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు యత్నించిన భర్తకు న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది… వివరాలు  ఇలా ఉన్నాయి… నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన గర్వే స్పందన,  గర్వే ప్రదీప్ లకు 29 అక్టోబర్ 2014 న సంప్రదాయబద్దంగా వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం సాఫిగా గడిచి పోయింది. వీరికి పదేళ్ల వయసు గల కూతురు,  ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రదీప్ కారు డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. ఇతను తరచుగా ఫోన్ లో మాట్లాడడం, మెసేజ్ లు పెట్టడం గమనించిన భార్య, తన భర్తకు వేరొక మహిళతో అక్రమ సంబంధం ఉన్నదని పసి గట్టింది. ఈ విషయాన్ని బలంగా అడగటంతో పెళ్లిలో మీ తల్లితండ్రులు పెట్టిన లక్ష నగదు కట్నం, బంగారం, బడిబాసాండ్లు సరిపోవని అదనంగా మూడు లక్షల నగదు కట్నం తీసుకుని రావాలని భార్యను మానసిక , శారీరక హింసలకు గురి చేసేవాడు. ఈ విషయంలో ఆమె జక్రాన్ పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. భార్యభర్తల విషయం కనుక పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. కొన్ని నెలలు మంచిగానే ఉన్న ప్రదీప్ యదావిధిగా భార్యను హింసలకు గురి చేశాడు. పిల్లలు ఉన్నారు అక్రమ సంబంధం వద్దు అన్నందుకు 11 ఏప్రిల్  2025 న అర్ధరాత్రి సమయంలో భార్యను ఉద్దేశించి నిన్ను చంపితే నాకు మనశాంతి ఉంటుందని,  వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉండచ్చని, చంపి వేయాలనె కోపంతో ఇంటిలో ఫ్యాన్ కు ఒక చీరను కట్టి, మరొక చీరతో భార్య మెడకు చుట్టి గట్టిగా గుంజి చంపి వేసే ప్రయత్నం చేశాడు. స్పందన అరుపులు కేకలు వేయడంతో ఎదురింటి సుశీల్, అతని తల్లి భూమా లు వచ్చి రక్షించారు. స్పందన జక్రాన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సమగ్ర నేర విచారణ జరిపి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. సదరు నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో మొత్తం తొమ్మిది మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని  పది ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసి  రెండు వస్తుగత సాక్ష్యాలు చీరలు పరిగణలోకి తీసుకుని ముద్దాయి ప్రదీప్ భార్యపై హత్యాయత్నం చేశాడనే నేరం రుజువు అయినట్లు నిర్దారిస్తూ ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విదిస్తూ స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article