27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పేదలకు గృహ భద్రత కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పేదలకు గృహ భద్రత కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యతని, పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆర్ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు అన్నారు. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వాగు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం నాందేవాడలో గల పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి అందిస్తున్న సహాయం స్వాగతించదగినదని పేర్కొన్నారు. అయితే భూమి లేని నిరుపేద కుటుంబాల పరిస్థితి గురించి ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లాలో వేలాది మంది పేదలు కనీస అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో జీవిస్తున్నారని, ఇలాంటి కడూ నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములను కేటాయించి గృహ నిర్మాణానికి కనీసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పూలాంగ్ వాగు పరిసర ప్రాంతంలోని సర్వే నంబర్ 328లో గల భూమి గురించి మాట్లాడుతు, పాత రికార్డుల ప్రకారం ధరణి పోర్టల్‌లో 6 ఎకరాల 23 గుంటలు (ఆబాది) ప్రభుత్వ భూమి ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ భూ భారతి రికార్డుల్లో అది కనిపించడం లేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఆ భూమిని సమగ్రంగా సర్వే చేసి, అర్హులైన పేద ప్రజలకు కేటాయించాలని కోరారు. ఆర్ఎస్ పి పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి పరిశీలించినట్లు తెలిపారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవేనని నిర్ధారించిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే, నిరుపేదలతో కలిసి పెద్ద ఎత్తున భూ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ పి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, నాయకులు అనిల్, గోపాల్ కృష్ణ పాల్గొన్నారు.

More articles

Latest article