29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మిక హక్కుల కోసం పోరాటమే నిజమైన మేడే సందేశం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) ఘనంగా నిర్వహించారు. ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జానకి రాములు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు దేశంలోని శ్రామిక వర్గాల జీవన పరిస్థితులను మరింత దయనీయంగా మార్చుతున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరచడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, కాంట్రాక్టు విధానాన్ని విస్తరించడం వంటివి కార్మికుల భద్రతను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. కర్షకులకు సరైన మద్దతు ధరలు ఇవ్వకుండా, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు, రైతులు, పేద ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మేడే ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకుంటూ, 8 గంటల పని విధానం, కనీస వేతనాలు, హక్కుల సాధన ఇవన్నీ కార్మికుల పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. ఈ హక్కులను కాపాడుకోవడం, విస్తరించుకోవడం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనిల్ , గోపాల్ సింగ్ ఠాకుర్, ముకుందం, వినోద్ గౌడ్, సయ్యద్ రఫీ ఉద్దీన్, టి. కృష్ణ, నిజాముద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్, సునీల్ తదితర కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కార్మికుల ఐక్యతను ప్రతిబింబించే నినాదాలతో సభ ముగిసింది.

More articles

Latest article